ఆళ్వారులు

 

 

విష్ణు భక్తి అనే భాగీరథిని ప్రవహింప చేసిన వారు పన్నిద్దరు ఆళ్వారులు. కృష్ణ దేవరాయలు వారు వీరిని తన ఆముక్తమాల్యదలో ఇట్లా ప్రస్తుతించారు:-

 

"అల పన్నిద్దరు సూరులందును సముద్యల్లీలగావున్న బె

గ్గలికం దానము బావ నా నిజ మన:కంజాత సంజాత పు

ష్కల మాధ్వీక ఝురిన్ మురారి పొగియంగా జొక్కి ధన్యాత్ములౌ

నిల పన్నిద్దరు సూరులం దలతు మోక్షేచ్ఛామతిం దివ్యులన్"

 

అంధకారం పోగొట్టి లోకానికి వెలుగిచ్చే వాదవటమ్ చేతనే సూర్యుణ్ణీ లోక బాన్ధ్వుడనీ, సూర్య నారాయణుడనీ అంటారు. కాని ఆ సూర్య భవానుని వేడిమి కూడా మితిమీరితే దుర్భరమే అవుతుంది కదా మరి! ఆ తాప తీవ్రత తగ్గించి మానవుల హ్రుదయాల్లోని అఙ్ఞానాంధకారం దూరం చేసి ఙ్ఞాన దీపం వెలిగించడానికే భూమి మీద ఈ ద్వాదశ దినసూర్యు లవతరించారు. కనుక, వీరు సూర్యులతో సమానులే కాదు - ఈ విషయంలో అతనిని మించినవారు కూడా!

 

ఈ ఆళ్వారులందరూ దేశకాలరీత్యా విభున్నులయినా, భగవదేకాత్ములవటం చిత్రాతిచిత్రం. పద్మాలు సూత్రబద్ధమై ఎలా ధారణయోగ్యమఊతాయో అలాగే ఈ దివ్యసూరుల మధుర భక్తిమమాలు కూదా భక్తిసూత్ర గ్రథితాలై సహృదయుల కంఠధారణ యోగ్యతకు నోచుకొన్నవి. ఇవి సామాన్య సూక్తులు కావు - మరి దివ్య ప్రేమ సురభిళ కల్పతరు ప్రసూనాలే!

 

ఈ భక్తి సరస్వతీ ప్రవాహం దక్శిణ భారతదేసంలో ద్రావిడ కవుల నాణినుంది సహజాతిసహజంగా మృథుమథురంగా సులభసుందరంగా వెలువడి:

 

ద్విపద. " అరవిందభవ సపర్యాప్త గోవిన్ద

చరణరవిందనిష్యంద మరంద

వారిధారాకార పరవారిపూర

పూరితగంభీరహూరినిర్ఘ్ఫ్శ

రంగదభంగసంభ్రమ భరోత్తుంగ

గంగా తరంగవైఖరులు దీపింప"

 

అని అన్నమాచారులు వాకొన్నట్లు- అయత్నంగా ఉత్తరదిశకు ప్రవహిస్తూ దుర్గమ పర్వతాలను సైతం ఆరోహిన్చి అ దిశ కవధి అయిన పరమపథంలో విరాజిల్లే పరతత్త్వం శ్రీమన్నారాయణునిలో ఐక్యం అవుతుంది.

 

ఆలకించండి ఈ శ్లోకం:-

 

"ఆకాశా త్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం,

సర్వదేవ నమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి."

ఆకసం నుంచి వర్షించిన జలం చివరకి సముద్రంలో కలిసినట్లే, ఏ దేవునికి నమస్కరించినా అది కేశవునకే చెందుతుంది.

 

ఆళ్వారుల నందరినీ సంగ్రహిన్చి పలికే శ్లోకమ్ ఇది:-

 

"భూతం సరస్య మహదహ్వాయ భట్టనాథ

శ్రీ భక్తిసార కులసేఖర యోగివాహాన్;

భక్తాంఘ్రీరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్

శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్"

 

1. పొయ్గయాళ్వార్ 2 పూదత్తాళ్వార్ 3 పేయాళ్వార్ 4పెరియాళ్వార్ 5 తిరుమళిశయాళ్వార్ 6 కులశేఖరాళ్వార్ 7 తిరుప్పాణాళ్వార్ 8 తొన్డరడిప్పొదియాళ్వార్ 9 తిరుమంగయాళ్వార్ 10 మధురకవియాళ్వార్ 11 ఆండాళ్ 12 నమ్మాళ్వార్.

 

శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.

 

భగవద్గుణనుభవం అనర్గళంగా వీరి వాక్కులనుంచి వెలువదింది. విష్ణుభక్తి అనే అగాధ నదిలో ముంచి ఉక్కిరిబిక్కిర్ చేసి మానవుల్ని కాపాడేవారయినందున వీరికి ఆళ్వార్ అనే నామమ్ సార్థకమయింది. కవితాసుందరి తనకు తానుగా వలచివచ్చి తమ వాక్కుల్ని వరించిన కారణంగా తమ పాశురకవితలతో మనల్ని రక్షించడానికే అవతరించారు వీరు.

 

వీరు పాడిన పాటలన్నీ మొత్తం నాలుగు వేలు. కనుకనే వీనికిఇ 'నాలాయిరం' అనే పేరు రూఢం అయింది. విశ్ణుభక్తిని ప్రతిపాదించే ఈ కావ్యసంతతికి 'దివ్య ప్రభంధం' అని కూడా పేరుంది. ఈ శాఖ్లో మొత్తమ్ ఇరవై నాలుగు ప్రభ్ంధాలున్నవి.

 

శ్రావ్య సంగీత మాధురిగల పద్యమే పాశురం. నాథముని ఈ ద్రవిడవేదానికి రాగతాళాలు కూడా నిబంధించి విరివిగా ప్రచారం కలిపించారు. ఈ తమిళ వేదంలో శ్రీ వైష్ణవ విశిష్ఠాద్వైత సిధాంతము మొత్తం నిగుణీకృతం చేయబడినది.

 

ఈ దివ్యప్రభంధం అంతటికీ మకుటాయమానం నమ్మాళ్వారుల తిరువాయిమొళి. భగవత్కటాక్షజన్య వాగ్ధోరణి అని దీని కర్థం. ఈ కవికే శఠకోపమహర్షి యని ఇంకో పేరు. వీరు శ్రీ మహా విష్ణువుకు పాద స్థానీయులు. ఈ మహాకవి మూర్థీభవించిన కరుణరసం. చెడు దారుల్లో కన్నుగావక పయనిస్తూ నరకకూపంలో పడిపోతూ ఉండే బద్దజీవుల్ని ఉద్ధరించడానికే వీ రవతరించారు.

 

వీరిలో మొట్టమొదట అవతరించిన పోయెగ పూదత్త ప్పెఏయాళ్వారులు అనే యోగిత్రయం ఒక పెనుతుఫానులో ఒక ఇంటి అరుగుమీద కలిసికొన్నారు. ఆ రాత్రిపూట - కన్ను పొడుచుకున్నా కానరాని ఆ కటిక చీకటిలో - ఈ ముగ్గురూ భగవద్గుణానుభవామృతపానమత్తచిత్తులై మైమరచి యున్నారు. వారి భక్తి ప్రకర్షకు ప్రరవశించిపోయి శ్రీ హరి ఉన్నట్లుండి అదృశ్యరూపంలో వచ్చి వారినడుమ నిలిచి చిన్దులు వేయసాగాడు. అపుడు ఫొయ్గయాళ్వారులు ఆ మహామూర్తిని గుర్తించటానికి ఒక దివ్యదీపం తెచారు. ఆ దీపకళిక ఇది:-

 

పా. " వైయం కకళియా వార్ కడలే నెయ్యాక

వెయ్యకతిరోన్ విళక్కాక - శెయ్య

శుడరాళియా నిడిక్కే శూట్టినేన్ శొన్మాలై

ఇడలాళి నీంగుక వే యెంగు "

 

భూమిని ప్రమిదగా చేసి, దానిలో సముద్రజలం అనే నెయ్యిపోసి, ఉష్ణకిరణాలతో వెలిగే సూర్యుణ్ణి వత్తిగా వేసిన దీపంతో స్వామి నర్చిస్తానన్నారీ కవి.

 

ఆ తరువాత పూదత్తాళ్వారులు తమ హృదయంలోనే ప్రజ్వలిస్తూ ఉన్న ఙ్ఞానదీపంతో ఆ శ్రీపతి కిట్లా నివాళి పట్టారు:-

 

పా. " అన్బే తకళియా ఆర్వమే నెయ్యాక

ఇన్బురుకుశిందై ఇడుతిరియా - నన్బురుకి

జానచ్చుడర్విళ క్కేత్తినేన్ నారణ్ర్కు

జానత్తమిళ్ పునిందనాన్ "

 

భక్తిని ప్రమిదగా చేసి ఆర్తిని నెయ్యిగా దానిలోపోసి, భగవత్సందర్శన జనితానందం అందులో వత్తిగావేసి, అఙ్ఞానాంధకారం దూరం అయ్యేటట్లుగా పరభక్తి అనే ఉజ్జ్వల దీపాన్ని నిండుమనస్సుతో అర్పించి ఆ శ్రీ హరిని అర్చిస్తున్నాను అని దీని అర్థం.

 

ఈ ఇద్దరు భక్తులూ వెలిగించిన ఙ్ఞానదీపం ఆధారంగా పేయాళ్వారులు ఆ భగవానుని దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కన్నుల కరువు తీరా సందర్శించారు. ఆ శుభక్షణంలో అయత్నంగా వెలువడిన సుమథుర వాణియే ఇది:-

 

పా. " తిరుక్కండెన్ పొన్మేనికండేన్ తికళుమ్

అరక్కన్ అణినిరముంకండెన్

పొన్నాళికండేన్ పురిశంగం కైక్కండేన్

ఎన్నాళి వణ్ణన్ పొల్ ఇంగు "

 

అహో! శ్రీమహాలక్ష్మితోపాటు శ్రీహరి సువర్ణ శరీరసౌందర్యం ప్రత్యక్షమైంది నాకిప్పుడు. పాపాత్ముల్ని చేదిన్చే సుదర్శనాయుధం కూడా స్వామి చేతిలో ఉంది. అంతేకాదు - ప్రళయకాలాభీల వర్జవ్యగర్జ ననుకరించే పాంచజన్యాన్ని సైతం కాంచగల్గిన సుకృతిని పొందాను. ఇట్టి నాకింకేమి కావాలి!

 

పెరియాళ్వారుల ఈ పాసురమ్ ద్రావిడవేదానికి ఓంకారమే:-

 

పా. " పల్లాండు పల్లాండు పల్లాయితత్తాందు

పలకోడి నూరాయిరం,

మల్లాండ తిండోళ్ మణివణ్ణా

ఉన్శెవడి శెవ్వి తిరుక్కాప్పు. "

 

మహాబలవన్తులైన చాణురాది మల్లుల్ని నల్లుల వలే నలిపివేసిన స్వామీ! నీ శ్రీచరణాలకు అనేక వేల లక్షలకోట్ల సంవత్సరాలు మంగళం!

 

విష్ణుచిత్తుడనే మరో ఆళ్వారుల ఆతిథ్య వైశిష్ఠ్యాన్ని ఉగ్గదించే రాయల ఈ పద్యం ఆంధ్రసాహిత్యరత్నాకరంలో ఉదయించిన ఉజ్జ్వల నీలమణి:-

 

శా|| " ఆ నిష్ఠానిధి గేహసీమ నడు రే యాలించినన్ మ్రోయు నెం

తే నాగేంద్రశయాను పుణ్యకథలున్ దివ్య ప్రభంధాను సం

ధాన ధ్వానము 'నాస్తిశాక భౌతా' 'నాస్త్యుష్ణతా' 'నాస్త్యపూ

పో' 'నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్త వ్య'మన్ పల్కులున్.'

- ఆముక్తమాల్యద

 

పది పాసురాలు మాత్రంగల కావ్యం వ్రాసి తిరుప్పాణ్ళ్వారులు ఉత్తమకవిగా వాసికెక్కినారు. వారి పాశురం:-

 

పా|| "అలమామరత్తినిలై మేలొరు పాలకనాయ్

జాలమేళుముండాన్ అరంగత్తరవి నణై యాన్,

కోలమామణియారముం ముత్తుత్తామముం ముడువిల్ల తోరెళిల్

నీలమేనియయ్యో నిరైకొండ తెన్నెంజమే. "

 

మహా ప్రళయంలో జగత్తంతా తన చిరుబొజ్జలో ఉంచుకొని చిన్ని మఱ్ఱి ఆకుమీద పసిబిడ్డడై పఱుండియున్న శ్రీ మహావిష్ణువే శ్రీ రంగంలో ఆదిశేషునిమీద శయనించి ఉన్నాడు. ఆ స్వామి దాల్చిన రమ్యమైన రత్నహారమూ, ముత్యాలపేరూ, వాని నీలవర్ణ శరీరమూ నా హృదయగాంభీర్యాన్ని రూపుమాపినవి.

 

మిగిలిన ఆళ్వారులందరూ శరీరం, నమ్మాళ్వారులు శరీరి. వీరి పాశురం మచ్చుకు:-

 

పా|| " పొలిక పొలిక పొలిక పోయిత్తు పల్లుయిర్ చాపం

నలియుం నరకముం నైన్దు నమనుక్కింగు యాతొన్నుమిల్లై;

కలియు కెదుం కండు కొణ్మిన్ కడల్వణ్ణన్ పూతంగళ్ మణ్ మే

మలియప్పు కుందిసై పాడియాడి యుళితర క్కండోమ్. "

 

భాగవతోత్తములలోనే భగవంతుడున్నాడు. అతని అస్తిత్వం వేరు లేదు. శ్రీహరికి చరస్వరూపులైన అట్టి భక్తుల్ని కాంచగానే మన పాపాలన్నీ పటపంచలైపోతాయి. కలిదోషాలు హరించి పోతాయి. ఇక యముని కౄర కలాపాలు మూలపడిపోయినట్లే. ఎటుచూసినా హరిభక్త సామ్రాజ్యమే సమృద్ధిగా ప్రత్యక్షమవుతుంది.

 

తన భక్తికవితామృతధారతో యవత్ భారతాన్ని ఉర్రూతలూగించిన ఆమె భగవత్కామావిష్ట మహాకవయిత్రి ఆండాళ్ తల్లియొక పాశురంతో ఈ వ్యాసానికి మంగళహారతి ఆలాపిద్దాం. ఇది ఆమె వ్రాసిన అద్వితీయ రసత్కావ్యం తిరుప్పావై లోనిది.

 

పా|| " శిత్తం శిరుకాలే వందున్నై చ్చేవిత్తు-ఉన్

పొత్తామరై యడియే పొత్తుం పొరుళ్ కేళాయ్,

పెత్తంమేయ్త్తుణ్ణుం కులత్తిల్ పింన్దు నీ

కుత్తేవల్ ఎంగళై క్కొళ్ళామల్ పోకాతు

ఇతైప్పరై కొళ్వానన్ఱుకాణ్ - కోవిన్దా

ఎత్తైక్కుమేళేళు పిరైవిక్కుం ఉన్దన్నో

డుత్తమే యావోమ్ ఉనక్కే నామాట్చెయ్‌వోమ్

మత్తైనమ్ కామఙ్గళ్ మాత్తేలో రెమ్బవాయ్. "

 

తెలతెలవారుతూ ఉండగా నీ పాదపద్మాలు సేవించడానికి వచ్చాము. గోవులనుకాచే కులంలో పుట్టినా మాఖు నీ అంతరంగకైంకర్యం అనుగ్రహించక తప్పదు సుమా! ఏడేడు జన్మల్లో నీతోనే మేము కలిసి ఉంటాము. నీకు మాత్రమే సేవ చేస్తాము. ఈ ఒక్కదాన్ని తప్ప మిగిలిన మా కోరికలన్నీ మట్టుపెట్టు గోవిందా!

 

 

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!